బెంగళూరు : దేశంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తే కరోనా చావుల కంటే ఆకలి మరణాలే ఎక్కువుగా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అనధికారిక లేదా అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి వల్ల ఉపాధి పొందు తున్నారన్నారు. లాక్‌డౌన్‌ భవిష్యత్తులోనూ కొన సాగితే వీరంతా జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయం నష్టపోవచ్చని అంచనా వేశారు. దీనివల్ల అంతిమంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, జీఎస్టీ వసూళ్లపై ప్రభావం పడుతుంద న్నారు. అనేక అభివద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవన్నారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యాధి అంటకుండా వారిని జాగ్రత్తగా చూసు కుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని కల్పిం చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్‌ మరణాలను మించిపోతాయని పేర్కొన్నారు.