Breaking News

గంగా ....విముక్తి....మేధావులారా బహుపరాక్‌!


       
         ఒకప్పుడు గంగానదిలో మునిగి చనిపోతే ముక్తి వస్తుందని కొంతమంది నదిలో దూకి చనిపోయేవారు. పూరి జగన్నాధ రథ చక్రాల కిందపడి చనిపోతే ముక్తి వస్తుందని కొంతమంది చనిపోయే వారు. రాజా రామ్మోహన్‌రారు తల్లి తారిణిదేవి ఇదే విధంగా ప్రాణాలు అర్పించింది. మతం పేరుతో నరబలులు, శిశు హత్యలు, సతీ సహగమనాలు, దేవదాసి వ్యవస్థ జరిగేవి. తల్లులు తన మొదటి సంతానాన్ని గంగామాతకు సమర్పించేవారు. అయితే ప్రస్తుత దేశ పరిస్థితి చూస్తుంటే అలాంటి మధ్య యుగాల కాలం మరలా వస్తుందా అన్న సందేహం కలుగుతోంది.నిన్న యుపిలో ముఖ్యమంత్రి గెటప్‌ మాదిరి గుండు గీయించుకోవాలని, నామాలు పెట్టుకోవాలని పప్పుదప్పనాలు మాత్రమే తినాలని అక్కడ అధికార యంత్రాంగం హుకూం జారీచేసిందని వార్త. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ గుండుగాని, పిలక గాని పెట్టు కోవాలని, నామాలు తప్పనిసరి అని బిళ్ళగోచి పెట్టుకోవాలని ఆదేశాలిచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. పొద్దున్నే టివి ఆన్‌ చేస్తే రంగురాళ్లు, సంఖ్యా శాస్త్రాలు, అష్టలకీë యంత్రాలు, జాతక చక్రాలు, పాము మంత్రం, తేలు మంత్రం, పెరుగు సముద్రం, పాల సముద్రం- ఏమిటిదంతా? ఎటుపోతున్నాం మనం? ఈ మధ్య టివి కార్యక్రమాలు, ఆత్మల పుస్తకాలు చదివి తమిలనాడులో ఒక భక్తుడు మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఎలా పైకి పోతుందో చూడటానికి తన భార్యను, తల్లిని, కొడుకును చంపుకున్నాడు. అయినా ఆత్మ కనపడలేదు. 20 ఏళ్ళ క్రితం వరంగల్‌లో ఒక భక్తుడు తనకిష్టమైన వ్యక్తిని బలి ఇస్తే దేవుడు కనిపిస్తాడని తన కొడుకును, భార్యను, తల్లిని నరికి చంపాడు, దేవుడు కనపడలేదు. ఉన్మాదం ఎక్కి తనకు తానే పొడుచుకొని చనిపోయాడు. దేశమంతా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగు తూనే ఉన్నాయి. ఇవన్నీ టివి చానల్స్‌ కార్యక్రమాల వల్ల, భక్తి పుస్తకాల వల్ల జరుగు తున్నాయి. దేవతల అనుగ్రహం పొందటానికి నరబలుల,జంతుబలులు ఇవ్వడం అనాది కాలం నుంచే ఉంది. ఒక పక్క మొన్ననే శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రయోగించారు. చంద్రుని మీదనో, అంగారకుడి మీదనో కాపురం పెట్టేందుకు ఒక పక్క ప్రపంచం ఉరకలేస్తోంది.మరి ఈ ఛానల్స్‌ చేసే వ్యాపార ప్రకటనలకు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కచ్చితంగా ఉంది. 70 ఏళ్ళ స్వాతంత్య్రంలో మూఢనమ్మకాల నిర్మూలన ఏ మాత్రం జరగలేదు. రాజ్యాంగం ఆర్టికల్‌51ఎ(హెచ్‌)లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం మానవ వాదాన్ని పెంచడం ప్రతి పౌరుని బాధ్యత అని రాసుకున్న సూత్రాలను అమలు పరుస్తామని మన మంత్రులు,ఐఎఎస్‌లు,ఐపిఎస్‌లు ప్రమాణం చేసినవారే.మరి వారి ప్రమాణాలు ఏమయ్యాయి. కంచె చేను మేసిన చందంగా వారే మూఢనమ్మకాల్లో కూరుకుపోయారు.1962లో అష్టగ్రహ కూటమి సంభవిస్తుందని దాని వలన దేశంలో ఎన్నో అరిష్టాలు జరుగుతాయని జ్యోతిష్యులు ప్రచారం చేయగా, అప్పటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ అది నమ్మవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. అలా చెప్పగల నాయకులు నేడు దేశంలో ఒక్కరైనా ఉన్నారా?పైగా వారే మధ్య యుగాల వైపుకు తీసుకువెళ్లేందుకు దేశంలో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మేధావులు, ఆలోచనాపరులు, అభ్యుదయ వాదులు, నాస్తికులు, హేతువాదులు ఈ విషయం పై ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.