Breaking News

పేదలను ఆదుకోవడానికి 65 వేల కోట్లు అవసరం

న్యూఢిల్లీ: భారత్‌లో పేదలను ఆదుకోవడానికి రూ. 65 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. రూ. 200 లక్షల కోట్ల జీడీపీ కలిగిన దేశంలో అదేమంత పెద్ద మొత్తం కాదనీ, పేదలను రక్షించడానికి.. వారికి జీవనోపాధిని కల్పించడానికి అది దోహదపడు తుందని ఆయన తెలిపారు. అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్‌.. కాంగ్రెస్‌పార్టీ నేత రాహుల్‌ గాంధీతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లో పేదలను ఆదుకోవడానికి ఎంతమేర నగదు అవసరమవుతుందని రాహుల్‌ గాంధీ అడగ్గా... రాజన్‌ పై విధంగా స్పందించారు.

ఇంకా రాజన్‌ మాట్లాడుతూ... 'ప్రజలను దీర్ఘకాలం పోషించే ఆర్థిక స్థోమత భారత్‌కు లేదు. సాపేక్షంగా మనది పేదదేశం కావడంతో ప్రజల దగ్గర తక్కువ వనరులు ఉంటాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడమూ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే. దీనిద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. లాక్‌ డౌన్‌ను ఎత్తేసే విషయంలోనూ ప్రభుత్వాలు ప్రణాళి కబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. పారిశ్రామికంగా పురోగతి సాధించడానికి భారత్‌కు ఇది సదావకాశం' అని తెలిపారు. వలసకూలీలు, దినసరి కార్మికులు, పేద ప్రజలు తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నా రనీ, తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా వారి ఆహార అవసరాలు తీర్చాలని ఆయన చెప్పారు. రైతులకు, వలసకూలీలలకు ప్రత్యక్ష పద్ధతి (డీబీటీ) ద్వారా నగ దును పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని రాజన్‌ అన్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎకానమీ (సీఎం ఐఈ) వెలువరించిన నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్న విషయం తనను ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఈ సంక్షోభ సమయంలో విభ జన, విద్వేష రాజకీయాలు దేశానికి మంచివి కావన్న రాహుల్‌గాంధీతో రాజన్‌ ఏకీభవించారు. ప్రజలలో సామాజిక సామరస్యం అవసరమనీ, అందరూ వ్యవస్థలో భాగమేనని ఆయన అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో విభజనవాదం దేశానికి చేటు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రచయితలు సైతం దాన్ని దృష్టిలో పెట్టుకునే వాటికి దూరంగా ఉన్నారని రాజన్‌ చెప్పా రు. ఏకవ్యక్తి కేంద్రంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో.. 'నేనే ప్రజల శక్తి' అనే భావం ఆ వ్యక్తిలో కలుగుతుందని అన్నారు. దానిద్వారా 'నేను చెప్పిందే ఏమైనా జరుగుతుంది. నా నియమాలే అందరికీ వర్తిస్తాయి. వికేంద్రీకృత నిర్మాణం కాదు. ప్రతిదీ నా ద్వారానే వెళ్లాలి' అనే భావన ఆ వ్యక్తిలో పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలోకి తొంగి చూస్తే అలా చేసిన రాజ్యాలు, దేశాలు కూలిపోయాయని రాజన్‌ స్పష్టం చేశారు. దేశంలో జనాభాకు తగినంతగా కరోనా పరీక్షలు జరగడం లేదనీ, ర్యాపిడ్‌ టెస్ట్‌ల ద్వారానే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని రాజన్‌ అభిప్రాయపడ్డారు.

No comments