Breaking News

దురాచారాలకు చైతన్యమే సమాదానం


తన ముక్కు కడుక్కోకుండా ఎదుటివారి ముక్కులో వేలు పెట్టి ''ఇదిగో వాసన ..'' అన్నాడట వెనకటికో అతితెలివి మంతుడు. నేడు ''ట్రిపుల్‌ తలాక్‌''పై విపరీత చర్చ జరుగుతున్నది. సోషల్‌ మీడియాలో రైట్‌ వింగ్‌ సైనికులంతా ఈ ''ట్రిపుల్‌ తలాక్‌''పై విపరీత పోస్టింగులతో ఊదరగొడుతున్నారు. హిందూ మతానికి ప్రతినిధులుగా ప్రచారం చేసుకునే బీజేపీ వారు తమ జాతీయ కార్యవర్గ సమావేశంలో సైతం దీని ప్రస్తావన తేవడం ఇతరుల అంతర్గత అంశాల్లోకి చొరబడటమే అవుతుంది. ''ట్రిపుల్‌ తలాక్‌'' వల్ల ముస్లిం మహిళలకు అన్యాయమే జరుగుతుండవచ్చు కానీ కోర్టుల్లో నమోదౌతున్న విడాకుల కేసుల్లో అత్యధికులు హిందువులే. బీజేపీ అకస్మాత్తుగా ముస్లిం మహిళల తరపున నిలబడుతున్నట్లు ప్రవర్తించడం అనుమానా లకు తావిస్తున్నది. నిజానికి బీజేపీ చేస్తున్నది అన్యాయమై పోతున్న ముస్లిం మహిళలకు న్యాయం చేయడం కోసం కాదు, దీని ద్వారా ఇస్లాంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి లబ్దిపొందే దురాలోచన మాత్రమే. ''తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు'' అంటూ వేమన చెప్పినట్టు... ''ట్రిపుల్‌ తలాక్‌''ను వేలెత్తి చూపే నాయకులు హిందూ మతంలోని లోటుపాట్లను సవరించడానికి మాత్రం ముందుకు రాకపోవడం హాస్యాస్పదం. ''ట్రిపుల్‌ తలాక్‌''పై మాట్లాడకుంటే ద్రౌపది చీర విప్పినట్టే అని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిథ్యనాథ్‌ పొంతనలేని పోలికలు చేస్తున్నారు. హిందూ మతంలోనూ స్త్రీని మాతమూర్తి అని పేరుకే పలుకుతారు. కానీ అత్యంత అగౌరవంగా చూస్తారనేది అక్షరసత్యం. గుళ్ళూ గోపురాల్లో స్త్రీలకు ఎన్నో ఆంక్షలు ఉన్నవి. గత ఏడాది శని సింగనాపూర్‌ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు బీజేపీ కార్యకర్తలెందుకు కదలలేదో? స్త్రీలను అనుమతించాలని నిరసనలు వచ్చినప్పుడు శబరిమల ఆలయ నిర్వహణా కమిటీ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అంతే కాక స్త్రీల స్వచ్ఛతను, అనగా ''రుతుస్రావంలో లేదు'' అనే విషయాన్ని పరీక్షించిన పిదపే అనుమంతించ వచ్చు అని నిబందనను విధించారు. ఈ నిబంధనను నిరసిస్తూ ఉత్తర భారత దేశం నుండి నిఖితా అజాద్‌ అను ఒక అమ్మాయి '' యెస్‌ ఐ బ్లీడ్‌'' అంటూ తన మెడలో ఒక పోస్టర్‌ వేసుకుని తన బాధను వెళ్ళబోసుకుంది. ఏ ఒక్క మత సంస్థ ఈ మహిళల వెనక నిలువలేదు. ''ట్రిపుల్‌ తలాక్‌''పై ఇంతగా స్పందిస్తున్న హిందుత్వ వాదులకు హిందూ స్త్రీల సమస్యలు మాత్రం పట్టటం లేదు. హిందువులు అంటే కేవలం పురుషులే కాదు స్త్రీలు కూడా అని గుర్తించాలి. పంజాబ్‌లోని గురుద్వారాలోకి స్త్రీ పురుష బేధం లేకుండా అందరినీ అన్నివేళలా అనుమతిస్తారనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. బహిష్టు సమయాల్లో స్త్రీని ఇంటి బయట కూర్చోబెట్టి తిండిపదార్థాలను విసిరేసే పద్ధతి హిందూ మతంలో ఉన్నది. ఇది సహించదగినదేనా? ఇట్లాంటి అంటరానితనపు చాందసవాద ఆచారాలాను ప్రశ్నించకపోతే అందరూ చరిత్ర హీనులౌతారు. ఈ రోజుల్లో నమోదౌతున్న గహహింస కేసుల్లో అత్యధిక శాతం హిందూ మహిళలే వున్నారన్న సత్యాన్ని గ్రహిస్తే ఎవరికోసం ముందుగా పోరాటం చేయాలో తెలుస్తుంది. ఇప్పటికీ వరకట్నపు చావులు సగటున రోజుకొకటి దేశంలో జరుగుతున్నవి. కులవివక్ష కూడా అన్ని మాతాల కన్నా హిందూ మతంలోనే చాలా ఎక్కువ. 
భర్త పోయిన స్త్రీలను విధవలను చేసే కార్యక్రమాల్లో పాటిస్తున్న విధానాలను, విధవలై ఒంటరి జీవనం గడుపుతున్న స్త్రీలను పండగలూ, పెండ్లిల్లూ పేరంటాల్లో అంటరాని వాళ్ళనిజేసి అవమానిస్తుంటారు. ఇట్లాంటి ఆచారాలను ఖండ ఖండాలుగా దునుమాడాల్సిన అవసరముంది. ఇలాంటి వాటిపై చొరవ చూపకుండా ఎదుటివారి ఇంట్లో అంతర్గత చిచ్చు రేపటం శ్రేయస్కరం కాదు.ముస్లిం మహిళలకు అన్యాయం జరిగుతుందని మొసలి కన్నీరుగారుస్తున్న వారంతా గుర్తుంచుకోవాల్సిందేమంటే, వివిధ మతాచారాలు చాలా భిన్నమైనవన్న సత్యాన్ని. ముస్లింల్లో పిన్ని కూతురుని పెళ్ళి చేసుకునే అచారం కొన్ని చోట్ల ఉన్నది. ఇది ఇతరులకు తప్పు కావచ్చు. కొంతమంది హిందువుల్లో సోదరి కూతుర్ని పెళ్ళి చేసుకునే ఆచారం ఉన్నది ఇది ఇతరులకు తప్పుఅనిపించవచ్చు. సారూప్యత లేని ఇలాంటి విభిన్న పార్శ్వాలు కులానికోవిధంగా మతానికోవిధంగా పాటించబడుతున్నవి. ఈ విశయాలన్నీ బీజేపీకి తెలియక కాదు. వారు ప్రతిపాదించే అసంబద్ద కామన్‌ సివిల్‌ కోడ్‌ కుట్రలో భాగమే ఈ అత్యుత్సాహం. ముందు హిందూ మతంలోని కులాల మధ్య ఐఖ్యత, సారూప్యత సాధన కోసం కషి చేయాలి... అది సాధ్యమైనప్పుడు ఇతరుల లోపాలను సరిచేసే ప్రయత్నం చేయవచ్చు. లేదంటే గురివింద గింజ సామెతే అవుతుంది. 
- జి. తిరుపతయ్య

No comments