Breaking News

నలభయ్యేళ్ల నడక


07-04-2017 03:46:21

ఇప్పుడు అదనంగా వచ్చి చేరిన సోషల్‌ మీడియాలోనూ అవలక్షణాలు వున్నా గుత్తాధిపత్యాలను ఛేదించడానికి మాత్రం గొప్ప సాధనమే. వారపత్రిక నుంచి సోషల్‌ మీడియా వరకూ నడిచిన ఈ నలభయ్యేళ్ల గమనం ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నదే గానీ అణుమాత్రం నైరాశ్యం కలిగించడం లేదు. ఆంధ్రజ్యోతి గమనంలో ఇవన్నీ పంచుకోవడమే అందుకో నిదర్శనం.

ఈ ఉగాది నాడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇతర మిత్రులతో పాటు పురస్కారం తీసుకున్నాను. సత్కారాల జంజాటానికి చాలా వరకూ దూరంగా వుంటూ వస్తున్నా. ఇది తెలుగు విశ్వవిద్యాలయం కావడం, మహనీయుడు తాపీధర్మారావు పేరిట అవార్డు వుండటం సంతోషంగా స్వీకరించడానికి కారణమయ్యాయి. 1977లో పత్రికా రంగంలో ప్రవేశించి నాలుగు దశాబ్దాలు కావడం అదనపు సందర్భమైంది. ఈ నలభై ఏళ్లలో సమాజంలో రాజకీయాల్లో మరీ ముఖ్యంగా మీడియాలో వచ్చిన మార్పులు కళ్లముందు కదలాడుతున్నాయి. తక్షణ సమస్యలు వివాదాలు నడుస్తున్నా ఈ సారి వాటిని గురించి మాట్లాడుకోవడానికి నన్ను జనసన్నిహితం చేసిన ‘గమనం’ ఉపయోగించుకుంటున్నా.
1977లో ‘ప్రజాశక్తి’ వారపత్రికగా వున్నప్పుడు అందులో చేరాను. (ఇది 1940లలో నిషేధానికి గురై 1968లో మళ్లీ మొదలైంది) అప్పటి అగ్ర పత్రికగా ‘ఆంధ్రప్రభ’కు అవి ఆఖరి రోజులు. జాతీయోద్యమానికి కరదీపిక ‘ఆంధ్ర పత్రిక’ బలహీనంగా నడుస్తున్నది. విశాలాంధ్ర కమ్యూనిస్టు వాణిగా వెలువడుతున్నది. 1950లలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు కమ్యూనిస్టులపై సాగించిన ప్రచారకాండను పోలిన అఘాయిత్యం మళ్లీ చూడలేం. దానికి నాయకత్వం వహించింది నార్ల వెంకటేశ్వరరావు కావడం ఒక వాస్తవం. (వాటన్నిటితో నేను ‘విషపుదాడుల వికృత చరిత్ర’ అనే పుస్తకం వెలువరించాను) 1955 ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తర్వాత, కాంగ్రెస్‌ ప్రధాన రాజకీయాలకు అనుగుణంగానే పత్రికలు నడిచాయి. గోరాశాస్త్రి ‘ఆంధ్రభూమి’ ఆయన సంపాదకీయాలకే పేరు పొందింది.

కెఎల్‌ఎన్‌ ప్రసాద్‌ యాజమాన్యంలో మొదట నార్ల తర్వాత నండూరి రామమోహనరావు సంపాదకత్వంలో ‘ఆంధ్రజ్యోతి’ కొంత భిన్నమైన పంథా తీసుకున్నది. 1975–-77 ఎమర్జన్సీ సెన్సార్‌షిప్‌ రుచిచూపింది. ఆ కాలంలో విశాఖలో చిన్నదిగా మొదలైన ‘ఈనాడు’ 1978 విజయవాడ ఎడిషన్‌ తర్వాత విస్తృత రూపం తీసుకుంది. ఆ రోజుల్లో రామోజీరావు విజయవాడ సమాచార శాఖ కార్యాలయంలో పత్రికల ప్రమాణాలపై తన భావాలపై కొద్దిమంది విలేకరులతో ఇష్టాగోష్టిగా చేసిన ప్రసంగంలో వాక్యాలు గుర్తున్నాయి. ఎమర్జన్సీ అనంతర ప్రజాస్వామ్య పవనాలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ఆగ్రహావేశాలు అఖిలపక్ష ఉద్యమాలూ, కేంద్రంలో జనతా ప్రభుత్వ పతనం ఇందిరాగాంధీ పునరాగమనం ఇవన్నీ పత్రికలకు గొప్ప మేత. పాఠకులకు జిజ్ఞాసులకూ ప్రేరణ. ఆశయాలతో ఆవేశాలతో పత్రికల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయొచ్చనే భావాలతో భ్రమలతో చదువుకున్న వారు వచ్చి చేరుతున్న దశ. సంపాదకీయాలను వేయికళ్లతో చదివి పండితులమనుకుంటున్న పాతరోజులవి. భాషా పరమైన దిశానిర్దేశంలో, సమతుల్యతలో ‘ఆంధ్రజ్యోతి’; వార్తాపరమైన వేగం విస్తృతిలో, శీర్షికలలో ‘ఈనాడు’ ఆకర్షణ కలిగి వుండేవి.

ఈ దశలోనే 1981లో ‘ప్రజాశక్తి’ దినపత్రికగా మారింది. 1982లో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం పత్రికలకూ రాజకీయాలు పెంచింది. 1984లో ప్రభావశీలంగా వచ్చిన ‘ఉదయం’ కొన్నేళ్లకు అస్తమించగా వార్త వచ్చి చేరింది. చంద్రబాబునాయుడు పాలన మలిదశలో ‘ఆంధ్రజ్యోతి’ మూతబడినా ఆర్కే ఆధ్వర్యంలో పునఃప్రారంభమై జయప్రదంగా నడవడం తెలుగులోనే గాక దేశంలోనే ఒక పెద్ద ప్రయోగమైంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పునరాగమనం తర్వాత ‘సాక్షి’ పెద్ద పత్రికగానే అవతరించింది. ‘సూర్య’ తదితర పత్రికలూ వచ్చాయి. ఈ దశలోనే బీజేపీ పెరుగుదల, వామపక్ష భావజాలానికి ఎదురుదెబ్బలు, రాష్ట్ర విభజన వంటి సంచలన చారిత్రక పరిణామాలు జరిగిపోయాయి. అస్తిత్వ ఉద్యమాల ప్రభావం అపారంగా పెరిగింది. ఇంతకు ముందు చెప్పిన నేపథ్యంలో మొదట నమస్తే తెలంగాణ, తర్వాత నవ తెలంగాణ, మన తెలంగాణ వచ్చి చేరాయి.

కంప్యూటరీకరణ, రంగుల హంగులు, ఎడిషన్ల పెంపు, జిల్లా పేజీలు, పాత్రికేయులు విలేకరుల సైన్యం, అడ్వర్టయిజ్‌మెంట్ల సామ్రాజ్యం ఇవన్నీ మా కళ్లముందే పెరిగిపోయాయి. వీటన్నిటికీ తామే ఆద్యులమని చెప్పేవారు ఆ మాట నమ్మేవారు వున్నారు గాని ఇది కాలంతో శాస్త్ర పరిజ్ఞానంతో వచ్చిన మార్పు. పెట్టుబడిని పట్టుదలను బట్టి, కొంత ముందు వెనక, కొంత ఎక్కువ తక్కువ. ఎవరెన్ని చెప్పినా పత్రికా రంగంలో ప్రయోజనాలు, ప్రాపకాలను బట్టి లాభనష్టాలు, ప్రభుత్వాల అనుకూల ప్రతికూలతలు వుంటాయి. ఇతరేతర వ్యాపారాలు రాజకీయ సంబంధాలూ కూడా వుంటాయి. సమాచారానికి సంబంధించిన ప్రమాణాలు పాటించడం, ప్రజలకు సత్యాన్ని అందించడం, పాలకుల పొరబాట్లను ధైర్యంగా బయటపెట్టడం పత్రికల మౌలిక ధర్మం. అయినా దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పాలకవర్గాల భావాలే చలామణి అవుతుంటాయన్నది అనుభవం. ఆకాశవాణి అచ్చంగా అధికార వాణిగా వుంటే పత్రికలు చదివిన తర్వాత గాని నిజాలు తెలిసేవి కావు. టీవీ రాకతో పత్రికా ప్రపంచం కాస్త మీడియాగా మారిపోయింది. దూరదర్శన్‌ మాత్రమే వున్నప్పుడు ఆకాశవాణిలాగే అనిపించినా ఉపగ్రహ ప్రసారాలు మొత్తం మార్చేశాయి. మీడియా నిర్వహణలోనూ స్పందనలోనూ కేవలం పండితులూ పరిణతులూ మాత్రమే వుండే స్థితిపోయి కొత్త గాలులు వీచాయి. కొంగొత్త పెట్టుబడులూ వచ్చి చేరాయి. దేశంలో ఎక్కడా లేనన్ని ఛానళ్లు, ఎక్కువ పేజీలు రంగులతో పత్రికలు, పరుగులు తీసే వేలమంది పాత్రికేయులూ, ముద్రాపకులూ ఒక సమాంతర వ్యవస్థగా మారింది. ఇందుకు నేను సాక్షినే కాదు, ఒక ప్రధాన భాగస్వామిని కూడా గనక బయిటివారికన్నా లోతుగా చూసే అవకాశం కలిగింది. వారపత్రిక నుంచి ప్రత్యక్ష ప్రసారాల వరకూ అన్ని దశల్లోనూ పాల్గొనే అన్ని తరాల స్వరాల స్రవంతుల ప్రతినిధులను ప్రముఖులను కలుసుకునే అవకాశం ఎన్నో అనుభవాలు నేర్పింది. సంపాదకులు సహచరులు రచయితలు నాయకులు ప్రముఖులు ఎందరినో గుర్తు చేసుకోవచ్చు.

వారందరి అభిమానం అండదండలు లేకుంటే ఈ ప్రస్థానం సాగేది కాదు. ఈ పురస్కారాన్ని కూడా మనసారా అభినందించిన వారెందరో.
మరి ఈ గమనం మొత్తంలో చూసిందేమిటి? నామ్‌చామ్‌స్కీ చెప్పిన అంగీకార సృష్టికి మీడియా జీవనాడిగా తయారవడమే (మీడియా మాయాజాలం పేరిట అదీ పుస్తకంగా వచ్చింది). ప్రపంచీకరణ ఈ పరిణామ క్రమాన్ని సంపూర్ణం చేసింది. భాషాప్రయోగాల నుంచి భావసంచయం వరకూ అన్ని తలకిందులుగా మారాయి. అద్భుతమైన సాంకేతిక ప్రగతి అనుక్షణ ప్రసారాలు ఆహ్వానించదగినవి. మూఢ నమ్మకాలూ అసభ్య శృంగారాలు వ్యక్తిగత వ్యవహారాల అవాంఛనీయ ప్రసారాలు అనుచితమైనవి. కొందరైతే కులతత్వాలతో కుళ్లిపోతున్నారు. మతతత్వాలతో మసలిపోతున్నారు. మరోవైపు మీడియాను కేవలం రాజకీయ వాణిజ్య ప్రచార సోపానంగా మాత్రమే చూసేవారు దేనికైనా తెగబడుతున్నారు. ప్రతిపక్ష పాత్రపై ప్రవచనాలు చెప్పిన వారు కేంద్ర రాష్ర్టాలకు సాగిలబడుతున్నారు. ఇతరేతర వ్యాపారాల కోసం సమాచారాన్ని ఫణం పెడుతున్నారు. సంపాదకీయాలు సంపాదక వ్యాఖ్యలు రాస్తే అభిప్రాయాలు చెప్పవలసివస్తుంది గనక ఆ బాధే లేకుండా చేసుకుంటున్నారు కొందరు. ఏ సెన్సారూ లేకపోయినా గీత దాటకుండా మీరు చెప్పేదే గీతావాక్యం అంటున్నారు. దాంతో పాలకులు కూడా కనీస విమర్శనైనా సహించలేనట్టు చెలరేగిపోతున్నారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ఉభయ చంద్రులే కాదు, వాషింగ్టన్‌లో ట్రంప్‌ మహాశయుడు కూడా మీడియాను శాపనార్థాలు పెట్టడం పరిపాటిగా మారింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు జరిగిపోతున్నాయి.

మీడియా యాజమాన్యాలకూ పాత్రికేయులకూ మధ్య తేడా చూడకుండా మాట్లాడ్డం వ్యర్థం. ఎవరి బుద్ధిని బట్టి వారు మీడియాను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మాత్రమే అంటే సరికాదు. ఇది ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర మారణమ్ము అన్నట్టు సమాచార సాంస్కృతిక రంగాల్లో వచ్చిన దుష్పరిణామాలను చక్కదిద్దుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలుగును వెనక్కు నెడుతున్న విధానాలతో భాషా ప్రమాణాలూ పలచబడిపోతున్నాయి. మీడియాలో అభద్రత ఒత్తిడి కారణంగా గతంలో వలె ఆశయాలు ఆదర్శాల కన్నా అవసరార్థం వచ్చేవారు అధికమయ్యారు. అయినా ప్రజాపక్ష వార్తలు ప్రజాస్వామ్య లౌకిక విలువల గురించి చూడకుండా వత్తులు దీర్ఘాల గురించి గుండెలు బాదుకోనవసరం లేదు. ఎందుకంటే మీడియా లోపాలనే చూసి దీపాలను ఆర్పుకోవడం అవివేకం. ఇందుకు పాలకులు యాజమాన్యాల బాధ్యత ఎక్కువైనా పాత్రికేయుల ఆత్మ పరిశీలనా అవసరమే. ఇప్పుడు అదనంగా వచ్చి చేరిన సోషల్‌ మీడియాలోనూ అవలక్షణాలు వున్నా గుత్తాధిపత్యాలను ఛేదించడానికి మాత్రం గొప్ప సాధనమే. వారపత్రిక నుంచి సోషల్‌ మీడియా వరకూ నడిచిన ఈ నలభయ్యేళ్ల గమనం ఆత్మ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుతున్నదే గానీ అణుమాత్రం నైరాశ్యం కలిగించడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ గమనంలో ఇవన్నీ పంచుకోవడమే అందుకో నిదర్శనం. అందరికీ వందనాలు.
తెలకపల్లి రవి
ఆంధ్రజ్యోతి

No comments