Breaking News

ఆల్వార్‌ అకృత్యం!


07-04-2017 03:35:34

రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో కొందరు గోసంరక్షకులు నడిరోడ్డుపైన ఆవులను వాహనంలో తరలిస్తున్న పెహ్లూఖాన్‌ అనే ఒక వ్యక్తిని దారుణంగా కొట్టిచంపిన ఘటన అత్యంత అమానుషమైనది. రాజస్థాన్‌నుంచి దాని సరిహద్దు రాష్ట్రం హర్యానాకు వాటిని తీసుకుపోవడానికి ఇతడితో పాటు మరో పదిహేనుమందికి జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లైసెన్సులు ఇచ్చింది. కానీ, ఆల్వార్‌ జాతీయ రాహదారిపై ఈ వాహనాలు కనబడగానే గోపరిరక్షకులు ఆగ్రహంతో ఊగిపోతూ వాటిని అటకాయించారు. అవి వధశాలలకు తరలుతున్నవి కావనీ, రైతులు కొనుక్కున్నవని వివరిస్తూ, జైపూర్‌ పశుమేళాలో ఆవులను కొనుగోలు చేసిన పత్రాలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన అనుమతులు, టోల్‌గేట్ల రసీదులు ఇత్యాదివన్నీ ఖాన్‌ కుటుంబీకులు వారికి చూపించారు. కానీ, గోవధ నిషేధం అమలులో ఉన్న రాజస్థాన్‌లో గోసంరక్షకుల కళ్ళకూ, చెవులకూ నిజంతో నిమిత్తంలేకుండా పోయింది. వారి దెబ్బలకు పెహ్లూఖాన్‌ మరణిస్తే, మిగతావారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైనారు. సరైన విధివిధాలతో ఒక నిర్ణయం సక్రమంగా అమలయ్యేట్టు చూడటానికి బదులు, ఒక ఉన్మాద వాతావరణాన్ని సృష్టించడానికే పాలకులు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలే జరుగుతాయి.

ఈ అమానవీయమైన దాడిని దేశమంతా చూసింది కానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ మాత్రం ఆ ఘటన జరగనే లేదన్నారు. రాజ్యసభలో గురువారం విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు, కోట్లాది భారతీయుల మనోభిప్రాయాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశాల విషయంలో విపక్షాలు జాగ్రత్తగా ఉండాలనీ, గోహత్యను సమర్థిస్తున్నట్టుగా, గోహంతకుల పక్షాన నిలబడినట్టుగా వారు కనిపించకూడదని నక్వీ హెచ్చరించారు. కానీ, గులామ్‌ నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించినట్టుగా, న్యూయార్క్‌టైమ్స్‌కు కూడా తెలిసిన ఘటన పార్లమెంటరీ వ్యవహారాలమంత్రికి మాత్రం కనిపించలేదు. ఇటువంటి ఘటనేదీ జరగనేలేదనీ, రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అటువంటిదేమీ జరగలేదని చెప్పిందని నక్వీ తేల్చేశారు. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ కొంతనయం, చర్యలు తీసుకుంటామని కనీసం ఓ హామీ అయినా ఇచ్చారు. రాజస్థాన్‌ హోమ్‌ మంత్రి వ్యాఖ్యలు మరింత అమానవీయంగా ఉన్నాయి, ‘ఆవులను తరలిస్తున్నప్పుడు అటువంటివి జరగడం సహజం’ అనడం ద్వారా, తమ ప్రభుత్వమే రవాణాకు అధికారికంగా అనుమతులిచ్చిన విషయాన్ని దాచేశారు ఆయన.

నిందితులనూ, బాధితులనూ ఒకే గాటన కట్టేశారాయన. రాజస్థాన్‌ పోలీసులు పదిమందిని అరెస్టుచేసి, ఐదుగురు గోరక్షకులమీద హత్యానేరాలను మోపితే, మిగతా ఐదుగురు దెబ్బలు తిన్నవారు కావడం విశేషం. దీనికి కారణం, పెహ్లూఖాన్‌ కుటుంబీకులు గోరక్షకుల చేతికి చిక్కి చావుదెబ్బలు తినడం పూర్తయిన 20 నిముషాల తరువాత పోలీసులు అక్కడకు చేరుకున్నప్పటికీ అప్పుడు వారు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఆ మరునాడు అంటే, ఏప్రిల్‌ 2వతేదీ మధ్యాహ్నం పెహ్లూఖాన్‌ సహా మరో ముగ్గురిపైన గుర్జర్‌ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, అటుగా పోతున్న గుర్జర్‌కు 200మందికి పైగా విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలూ, ముగ్గురు గాయపడిన వ్యక్తులూ అక్కడ కనిపించారు. వాహనాల్లో అమానుషంగా కుక్కివేయబడిన ఆవులు, లేగదూడలు కనిపించాయి. వాహనదారుల వద్ద అధికారపత్రాలను గుర్జర్‌ పరిశీలించే ప్రయత్నం చేసినప్పుడు అవి లేవనీ, హర్యానాలోని కబేళాకు వాటిని తరలిస్తున్నట్టు నిజం అతనికి తెలిసింది. ఈ ఫిర్యాదు తరువాతే, విధిలేక బాధితులపై దాడిని కూడా పోలీసులు నమోదుచేయవలసి వచ్చింది. గోరక్షకుల మాదిరిగానే ఖాన్‌ కుటుంబీకుల గోడును పట్టించుకోని పోలీసులు, వారిమీద నమోదుచేసిన కేసును అనంతరకాలంలో కూడా ఉపసంహరించుకోకపోవడం ఆశ్చర్యకరం.

స్వయంప్రకటిత గోరక్షకుల ఆగడాలకు ఆల్వార్‌ ఘటన మరొక ఉదాహరణ. ‘గోపరిరక్షణ’ పేరుతో అనధికార బృందాల దూకుడు ఒక చట్టబద్ధమైన వ్యవహారంగా మారుతున్న వాతావరణం ఏర్పడుతున్నది. ఆల్వార్‌ ఘటనలో మాదిరిగానే అనేకచోట్ల క్రయవిక్రయాలకు ఇచ్చిన ప్రభుత్వ అనుమతులకు కూడా విలువలేకుండా పోతున్నది. ఈ వీరంగం గోమాంసాన్ని అడ్డుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. అన్ని అనుమతులూ ఉన్న పశువ్యాపారులను, మాంసం వర్తకులను కూడా వీరు వేధిస్తున్నారు. మటన్‌, చికెన్‌ వర్తకులను కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఎదుటివారు ముస్లింలు అయితే వాస్తవాలతో నిమిత్తం లేకుండా పోతున్నది. యూపీలో ఈ రకమైన వాతావరణం వల్లనే ఆహారానికి తీవ్రమైన కొరత ఏర్పడి ఇప్పుడు ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం హైకోర్టుతో చీవాట్లు తినవలసి వచ్చింది. అనుమతులున్న కబేళాలను కూడా ఎందుకూ కొరగాని కారణాలతో మూసివేసిన పోలీసుల దూకుడుకు, గోరక్షకుల ఆగడాలు కూడా తోడైనాయి. మాంసం అంటే చాలు అనుమానించి దాడులు చేసే వాతావరణాన్ని భరించలేక మటన్‌,చికెన్‌ కూడా అమ్మడం మానేశారు వ్యాపారులు. చివరకు చేపలవర్తకులు కూడా భయపడే పరిస్థితి రావడంతో 70శాతానికిపైగా మాంసాహారులున్న రాష్ట్రంలో తీవ్ర ఆహారకొరత ఏర్పడింది. గోకళేబరాన్ని మోసుకుపోతున్న దళితుల యువకులను గుజరాత్‌లో చంపివేయడం నుంచి, అఖ్లాఖ్‌, పెహ్లూఖాన్‌ తరహా ఘటనలు గోరక్షణ పేరిట అడ్డులేకుండా సాగుతున్నాయి. పాలకులే ఒక ఉన్మాద వాతావరణాన్ని సృష్టించి వదిలేసిన నేపథ్యంలో, స్వయంప్రకటిత గోరక్షకులను కఠినంగా శిక్షించకపోతే, బీజేపీ పాలిత రాష్ట్రాలు వరుసపెట్టి గోవధను నిషేధిస్తున్న తరుణంలో మరిన్ని ఘటనలు చూడవలసి రావచ్చు.
(ఆంధ్రజ్యోతి)

No comments