Breaking News

ఆగమౌతున్న అధ్యాపకుల జీవితాలు


07-04-2017 03:53:41
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల బతుకులు అధ్వాన్నంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా గత ఎన్నో ఏళ్లుగా పార్ట్‌టైం లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారికి వర్క్‌లోడ్‌ ఏర్పడినా, కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు కాలేక పార్ట్‌టైం లెక్చరర్స్‌గా మిగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి వీరందరిని కాంట్రాక్టు ఆధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేసి రెగ్యులరైజ్‌ చెయ్యాలి.

మేధో సంపత్తిని పెంపొదించే లక్ష్యంతో గుణాత్మక విద్యను అందించడం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మేధావులుగా తీర్పిదిద్దుతాయి. అదే కోవలో సుదీర్ఘ ఘన చరిత్ర కలిగి, శతాబ్ది ఉత్సవాలకు నేడు సిద్ధమవుతున్నది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. వందేమాతర ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్యాయాన్ని ప్రతిఘటించే పెక్కు ఉద్యమాలకు వేదికై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సుసంపన్నమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మేధో వారసత్వ సంపదను దేశ విదేశాలకు అందించ గలిగింది.

యూనివర్సిటీలలో వరుసగా ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తుండడం, సకాలంలో ఆ పద వుల్ని భర్తీ చేయలేకపోయిన కారణంగా ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను నియమిస్తున్న ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. గత 22 ఏళ్లుగా ఓయూలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను, పార్ట్‌టైం లెక్చరర్స్‌ను నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం యూనివర్సిటీలో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు నిర్వహించారని పేర్కొంటూ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014 జూన్‌ రెండో తేదీ, ఆ తరువాత కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకం చెల్లదని ఆ ఉత్తర్వు ఆదేశించింది. ఇక ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసుకోవద్దని నిర్దేశించింది. దీంతో ఓయూలో వివిధ డిపార్ట్‌మెంట్లలో నియమితులైన 36 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 150 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాలను యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. అధ్యాపకుల అవసరం తప్పనిసరిగా ఉండడంతో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. అవసరం ఉన్నా, అర్హతలు ఉన్నా ఆయా డిపార్ట్‌మెంట్‌లలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలను 2014-–15 విద్యా సంవత్సరం నుంచి ఓయూలో చేపట్టడం లేదు.

అలాంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఆధ్యాపకుల బతుకులు అధ్వాన్నంగా మారాయి. అధ్యాపకుల పదవీ విరమణ నిరంతరం జరుగుతున్న సమయంలో వర్క్‌లోడ్‌ (అవసరం మేరకు) యూజీసీ నిబంధనల ప్రకారమే ఒక డిపార్ట్‌మెంట్‌కు అవసరమైన ఆధ్యాపకులను కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులుగా నియమితులైన వారికి ఏడాదికి 11 నెలల వేతనాలు వచ్చేవి. అనంతరం వారి పోరాట ఫలితంగా 11 నెలల 24 రోజుల వేతనాన్ని వర్సిటీ ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా గత ఎన్నో ఏళ్లుగా పార్ట్‌టైం లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారికి వర్క్‌లోడ్‌ ఏర్పడినా, కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు కాలేక పార్ట్‌టైం లెక్చరర్స్‌గా మిగిలిపోతున్నారు. యూనివర్సిటీకి అవసరం ఉన్నటువంటి పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులకు అన్ని అర్హతలు ఉన్నా ఆయా డిపార్టుమెంటులలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్టు అసిస్టెంట్‌(ప్రొఫెసర్‌)గా అప్‌గ్రేడ్‌ కాలేకపోయారు. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయ పార్ట్‌టైం టీచర్స్‌ కాంట్రాక్టు అధ్యాపకులుగా నియమితులైన వారు ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనాన్ని పొందుతారు. కాని అంతే వర్క్‌లోడ్‌ తీసుకుని అవే బాధ్యతలు నిర్వహిస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారు ఏడాదికి 6 నెలల వేతనాన్ని మాత్రమే పొందుతూ కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే దాదాపుగా 200 మంది పార్ట్‌టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. డిపార్టుమెంటులలో పదవీ విరమణ లేదా తదితర కారణాలతో ఏర్పడిన వర్క్‌లోడ్‌లో వీరిని పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగించవచ్చు. 705 రెగ్యులర్‌ అధ్యాపక ఖాళీల్లో కేవలం 451 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంకా 254 ఖాళీలు అందుబాటులో వున్నాయి. ఈ ఖాళీలలో పార్ట్‌టైం లెక్చరర్లను పూర్తికాలం లెక్చరర్లుగా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆటంకాలు, నిబంధనలు అడ్డురావు. ప్రభుత్వ అనుమతి అంతకంటే అక్కరలేదు. కేవలం పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకోవడానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదనే సాకుతో పార్ట్‌టైం అధ్యాపకులను పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం లేదు. ఇప్పటికైనా వీరిని పూర్తికాలం అధ్యాపకులుగా మార్చాలి. పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం మూలాన మమ్మల్ని ప్రభుత్వం క్రమబద్దీకరించే అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. గతంలో విశ్వవిద్యాలయాల్లో పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులు ఉన్నప్పటికీ, కనీసం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అప్‌గ్రేడ్‌ చెయ్యమని అనేకసార్లు యూనివర్సిటీ ఆధ్యాపకులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి వీరందరిని కాంట్రాక్టు ఆధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేసి రెగ్యులరైజ్‌ చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానంలోనే పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వర్క్‌లోడ్‌ ఉన్న డిపార్ట్‌మెంట్లలో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా నియమించాలి. అప్పుడే ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనం వస్తుంది. ప్రస్తుతం ఓయూలో దాదాపు 200 మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్నారు. ఉన్న వర్క్‌లోడ్‌ ప్రకారం ఇందులో ఇప్పటికిప్పుడు పనిచేస్తున్న వారిలో చాలా మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా పదోన్నతి పొందవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో మమ్మల్ని పార్ట్‌టైం ఉద్యోగుల రెమ్యునరేషన్‌ను పీరియడ్‌కు ప్రస్తుతం ఉన్న రూ. 475ల నుంచి రూ.వెయ్యికి పెంచాలి. మా డిమాండ్లను నెరవేర్చాలని విశ్వవిద్యాలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓయూలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులందరినీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రెగ్యులరైజ్‌ చేయాలి. పార్ట్‌టైమ్‌ అధ్యాపకులను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌)గా నియమించడానికి అడ్డుపడుతున్న ప్రభుత్వ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులకు వారానికి 16 పీరియడ్స్‌ వర్క్‌లోడ్‌ ఇవ్వాలి. వారిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సి)గా అప్‌గ్రేడ్‌ చేసేవరకు కొత్త పార్ట్‌టైం అధ్యాపకులను నియమించరాదు.
డాక్టర్‌ బోనకుర్తి సోమేశ్వర్‌
ప్రెసిడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్‌టైమ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌

No comments