Breaking News

మీ దుర్మార్గపు రాజనీతిని ఖండిస్తున్నాం.

సూక్మాలో సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు చంపితే మౌనంగా ఉన్నారేమిటి? ఎక్కడికి పోయాయి మీ హక్కుల స్వరాలు?
ఘాతుకాన్ని ఖండించరా? ఎందుకు ఖండించం. ఖండిస్తాం.

మిషన్ 2016 అని పేరు పెట్టి వందలాది మంది ఆదివాసులను చంపేసి, స్త్రీలపై అత్యాచారాలు చేసి, ప్రశ్నించినవారందరిపై కేసులు పెట్టినప్పుడు ʹరూల్ ఆఫ్ లాʹ, చట్టం, ప్రజాస్వామ్యం మృగ్యమయిపోతే, మాట్లాడుకోడానికి, చర్చించడానికి స్పేస్ లేకపోతే ఏం జరుగుతుందో తెలిసీ ప్రభుత్వం ప్రజలపై యుద్ధానికి సిద్ధపడింది. దీన్ని ఖండిస్తున్నాము.

మావోయిస్టుల నిర్మూలన ఎన్నటికీ సాధ్యం కాదని ప్రభుత్వానికి తెలుసు. నీళ్ళలో చేపల్ని చంపాలంటే నీళ్ళన్నీ తోడేయాలనే సూత్రామే ఆపరేషన్ గ్రీన్ హంట్. ఈ గ్రీన్ హంట్ ను ఎప్పటి నుండో ఖండిస్తున్నాం. ఈ ఆకుపచ్చని వేట పచ్చని అడవిని, దానిని సంరక్షిస్తున్న ఆదివాసీని, ఆ ఆదివాసీకి ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించిన విప్లవాన్ని నేలమట్టం చేయడానికే. మావోయిస్టుల సంఖ్య, శక్తి బాగా తగ్గిపోయింది, ఇన్ని వందలే ఉన్నారు, వేళ్ళ మీద లెక్కించగలిగే నాయకులే మిగిలి ఉన్నారు అని ఒకవైపు చెప్తూనే వారి ఉద్యమాన్ని దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా ప్రకటించారు. ప్రకటించి ఏం చేశారు? దేశంలో అత్యంత పేద ప్రజల మీద 5,20,000 పారామిలిటరీ, కమాండో, పోలీసు బలగాల్ని మోహరించారు. ఈ దేశంలో అత్యంత వెనకబడ్డ ఆదివాసీ మీద, ఆ ఆదివాసీ మీద కూడా ఎందుకంటే రాజ్యాంగం తనకు దఖలుపరచిన అడవిపై హక్కును అడిగినందుకు ఘనత వహించిన ప్రజాస్వామిక రాజ్యం ఘనమైన దేశ సైనికశక్తిని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, దేశ బడ్జట్ లో అత్యధిక భాగం నిధుల్ని నిస్సిగ్గుగా వెచ్చిస్తున్నది. ప్రవేటు ముఠాలను తయారుచేసి ఆయుధాలందించి ఆదివాసీల మీద అత్యంత దారుణమైన అరాచకాలకు పాల్పడుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే ఎందుకు ఖండించారు అని అడిగేవాళ్ళు ముందు ఇది చెప్పాలి. ఛత్తీస్ఘడ్ తాడిమెట్ల గ్రామంపై స్పెషల్ పోలీసులు దాడి చేసి 160 ఇళ్ళు తగలబెట్టారని స్వయంగా సి.బి.ఐ విచారణలో తేలింది. ఇవి ఎన్నడైనా మీడియా వార్తలకెక్కాయా? ఇవాళ కార్చిన కన్నీళ్లలో ఒక్క నీటి చుక్కంతైనా దండకారణ్య ఆదివాసుల పట్ల వెచ్చించారా?

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా మిషన్ 2016 మొదలవ్వగానే జనవరి 11 నుండి 14 వరకు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బాసగూడ ప్రాంతంలోని నేంద్ర గ్రామంలో పోలీసు బలగాలు బీభత్సం సృష్టించాయి. 13మంది మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. మరెంతో మందిని బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టి చెప్పలేని చోట్ల చేతులు పెట్టి హింసించారు. మర్మాంగంలో కారం పెడతామని, పరమ అసభ్యంగా తిడుతూ బెదిరించారు. దేశ రక్షకులు నాలుగు రోజుల పాటు ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిపిన విషయం వెలుగు చూస్తే వారి నైతిక స్థైర్యం డెబ్బతింటుందేమో, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది జాతీయ స్థాయి సంచలన వార్త కాలేదు. ఛత్తీస్ఘడ్ లో ఇది మొదటిది కాదు, చివరిదీ కాదు.

డిసెంబర్ 16, 201613 ఏళ్ళ పిల్లవాడు సోమారు పొట్టంను చెట్టుకు కట్టేసి తుపాకీ బాయ్ నెట్లతో పొడిచి పొడిచి చంపారు. ఎవరూ మాట్లాడకముందే ఎన్ కౌంటర్ అని, సోమారు పొట్టం ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టని ప్రకటించారు. స్కూల్ పిల్లలు బిజ్నూ, సోన్కులు -ఒకరు ఎనిమిదో తరగతి, మరొకరు తొమ్మిదో తరగతి- కూడా కరడుగట్టిన మావోయిస్టులే. వీళ్ళను కూడా పట్టుకుని కాల్చి చంపి ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారని.. కాదు కాదు హతం అని చెప్పారు. (సెప్టంబర్ 25, 2016). పదిహేడేళ్ళ అర్జున్ ముప్పై ఏళ్ల మావోయిస్టుగా పోలీసు చార్జ్ షీట్లో నమోదవుతాడు. అష్టకష్టాలు పడి బెయిల్ సంపాదించి జైలు నుండి బైటికి వస్తే పోలీసుల చేత కాల్చివేయబడి, ఎన్ కౌంటర్ లో నక్సలైట్ హతం అని వార్తలకెక్కుతాడు. ఇటువంటివేవీ సభ్య సమాజానికి తెలీనివ్వకుండా కప్పిపెడుతున్న మీడియా వైఖరిని ఖండిస్తున్నాం.

జులై 8, 2016, కంధమల్: ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలపై కాల్పులు జరిపి కూడా ఎన్ కౌంటర్ అన్నారు. అయిదు ప్రాణాలు పోయాయి. కూకల్ దిగల్, తిమరి మల్లిక్, బ్రింగులి మల్లిక్, మిదియాలి మల్లిక్, వీరితో పాటు రెండేళ్ల చిన్నారి దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిందన్నమాట. అవును ఇప్పుడు పరిహసించబడుతున్న మానవ హక్కుల కార్యకర్తలు వాస్తవాలను బయట పెట్టాకే వీరి కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

జూన్ 13, 2016200 మంది పారా మిలిటరీ బలగాలు, కోయకమెండోలు చేసిన వీరోచిత కార్యం కూడా చెప్పనివ్వండి. వీళ్ళంతా గోంపడ్ గ్రామంపై దాడి చేసి ఆదివాసుల్ని విపరీతంగా కొట్టి పదహారేళ్ళ మడ్కమ్ హిడ్మేను ఎత్తుకుపోయి, అడ్డుపడిన గ్రామస్తులను తుపాకులతో బెదిరించి, చింతగొప్ప క్యాంపులో అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. శవానికి ఆలివ్ గ్రీన్ దుస్తులు తొడిగి పక్కన తుపాకి పడేసి ఎన్ కౌంటర్ లో మహిళా మావోయిస్టు హతం అన్నారు. ఈ సంఘటనపై జులై 18న బస్తర్ బంద్ కూడా జరిగింది. ఇది ఎందుకు వెలుగు చూడలేదు?

అదే జులై 16500మంది సి.ఆర్.పి.ఎఫ్, సల్వాజుడుమ్ బలగాలు బీజాపూర్ జిల్లా పావూరిగూడెం గ్రామాన్ని చుట్టుముట్టి పొలం పనులు చేసుకుంటున్న నలుగురు యువకుల్ని పట్టుకుని కాల్చి చంపాయి. ఆ తర్వాత గ్రామస్తులను కొట్టుకుంటూ వారి సంప్రదాయ ఆయుధాలైన విల్లంబులను, బాణాలను జప్తు చేసుకుంటూ, కోళ్ళు, మేకలు, డబ్బు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇది కూడా ఎన్ కౌంటర్ గానే వార్తలకెక్కింది.

8 జూన్ 2016న దంతెవాడ స్టేష‌న్ ప‌రిధిలోని పొదుం గ్రామంలో త‌మ కిరాణా షాపును మూసివేస్తున్న 14 సంవ‌త్స‌రాల బాలిక‌పై అక్క‌డికి వ‌చ్చిన సీఏఎఫ్ జ‌వాన్లు రాత్రంతా షాపులో బంధించి అత్యాచారం చేశారు. సోనిసోరి వంటి హక్కుల కార్యకర్తల సహకారంతో ఫిర్యాదు నమోదైతే అత్యాచారం చేసిన జవాన్ను చాకచక్యంగా తప్పించారు. ఆర్ ఆర్ నేతం అనే పేరు, ఒక నంబర్ బైటపెట్టి, చివరికి ఇది తప్పుడు పేరని, అలాంటి పేరుగ‌ల వ్య‌క్తి పోదుమ్ గ్రామం వద్ద నున్న జరుమ్ క్యాంపులో ఎవ‌రూ లేరని తేల్చారు. ఇటువంటివి కూడా వార్తల్లోకి రావు.

సుక్మా జిల్లా, దోర్న‌పాల్ మండ‌లం, పాల‌మ‌గ్డులో 2016 జ‌న‌వ‌రి 3న గంట‌సేపు మావోయిస్టుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టులు చ‌నిపోయార‌ని వార్త వచ్చింది. కానీ చనిపోయింది స్నానానికి నదికెళ్లిన 13ఏళ్ల మంజం శాంతి, 14ఏళ్ల సిరియం పొజ్జె.

2017 జనవరి 28న బస్తర్ లోని కిరణ్ దుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గలగంపూర్ గ్రామానికి చెందిన భీమా కుదితి, సుక్మతి హేమ్ల సంతకు పోయి వస్తుండగా పోలీసులు పట్టుకుపోయారు. మర్నాడు ఎన్ కౌంటర్ వార్త. శవాలపై చిత్రహింసల గుర్తులు. హేమ్ల కనుగుడ్లు లేవు. ఈ ఇద్దరి శవాలను ఖననం చేయకుండా ఇరవై రోజులు పైగా గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇది కూడా వార్త కాదు.

సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను మావోయిస్టులు చంపేసిన చింతగుప్ప గ్రామంలోనే ఏప్రిల్ 1 ఉదయం 4గంటలకు పోలీసులు ఓ కుటుంబంపై దాడి చేసి పదిహేనేళ్ళ అమ్మాయిపై అత్యాచారం చేశారని హిందూ పత్రిక రిపోర్టు చేసింది. ఇటువంటి ఘటనలు ఎన్నని చెప్పాలి? పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావు. ఒక వేళ నమోదైనా విచారణ జరగదు. కోర్టులు, మానవ హక్కుల కమిషన్లు న్యాయం చేయవు. ఇక ఆదివాసులకు మిగిలిందేమిటి?

హక్కుల కార్యకర్తలుగానీ, జర్నలిస్టులు గాని బస్తర్ లో ప్రవేశించడానికి వీల్లేదని అక్కడి పోలీసు అధికారులు శాసనం చేస్తారు. ఎవరైనా అక్కడికెళ్లడమే నేరమైతే అక్కడి ప్రజలపై యుద్ధం గురించి మాట్లాడ్డం ఇంకా పెద్ద నేరం. సాయిబాబా వంటి వాళ్ళు ఆ నేరం చేసి శిక్ష అనుభవిస్తున్నారు.

సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నారు కదా? ఎందుకు మాట్లాడం. వాళ్ళు చనిపోవడానికి కారణమైన యుద్ధం గురించి తప్పక మాట్లాడతాం. దండకారణ్య హాహాకారాలు, నెత్తుటి ప్రవాహాలు ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టనప్పుడు, కాళ్ళ కింద నేల కరిగిపోతున్నప్పుడు, క్రూర మృగాల వలే వేటాడబడుతున్నప్పుడు ప్రజలకు వేరే ఏ మార్గం మిగల్చని ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. కంపెనీల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఘర్షణ పడుతున్నప్పుడు ప్రభుత్వమూ, పెట్టుబడిదారులు జవాన్లను ముందుకు నెట్టి శవాలను లెక్కించే దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. అటూ ఇటూ ప్రాణాలు పోతూ ఉంటాయి. యుద్ధం ఆగదు. కొంతమంది జవాన్లు చనిపోతే సైనిక శక్తి తగ్గదు. కొద్ది మంది మావోయిస్టులు, ఆదివాసులు చనిపోతే ఉద్యమమూ ఆగదు. ఎన్నేళ్లయినా వీళ్ళకు అర్థం కాక కాదు. మనుషుల ప్రాణాలంటే లెక్కలేక. ప్రజలు తమకోసం తాము కొట్లాడుతున్నారు. మావోయిస్టులు ప్రజల కోసం కొట్లాడుతున్నారు.

పాలకులు తమ (వారి) ప్రయోజనాల కోసం పేద ప్రజల నుండే కొంత మందికి ఆయుధాలిచ్చి రక్షణ పేరిట పంపుతున్నారు. పోతే పోనీ కొద్ది మంది జవాన్ల ప్రాణాలు. పాలకులకు పోయేదేముంది. అది చూపి మరింత ఉక్కుపాదం మోపవచ్చు. ప్రజాస్వామ్యమో అని గోల చేసే మేధావులను జైళ్లలో తోసేయొచ్చు. ఈ రాజనీతిని మేం ఖండిస్తున్నాం.


No comments