Breaking News

ఈ గడ్డమీదే చంపబడ్డ...కలేకూరి

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేల ఏళ్ళక్రితం ఈ గడ్ఖమీదనే చంపబడ్డాను
పునరపి మరణం పునరపి జనం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను నా దేహం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమయ్యింది. నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి. నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది.
త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేణ్మణి,కారంచేడు, నీరుకొండ
ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెలమీద నాగేటి కర్రులతో పచ్చబొడిసిన పేరు చుండూరు.
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు రగిలే రాచపుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి
అవమానాలకు,అత్యాచారాలకూ,మానభంగాలకూ,
చిత్రహింసలకు గురై
పిడికెడు ఆత్మగౌరవంకోసం తలెత్తినవాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకున్నవాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి
నన్ను బాధితుడని పిలవకండి
నేను అమరుణ్ణీ‌, నేను అమరుణ్ణి,నేను అమరుణ్ణి !
లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంఠుణ్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుడి నెత్తిమీద యీడ్చితన్నినవాణ్ణి
రగిలే గుండె కొలిమిలో నినాదాలు సరిపిస్తున్నవాణ్ణి
నాకు జాలిజాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను
మీ గుండెల్లోకి అవాహన చేసుకోండి
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను
✍️ కలేకూరి ప్రసాద్

No comments