Breaking News

పా..రేసు..కున్న సినారే


సుమారు 40 ఏళ్ల క్రితం. సి.నారాయణరెడ్డి గారిని తమ గ్రామంలోని పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ కరణం గారు, ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు సినారె గారి ఇంటికి వెళ్ళారు. సినారె వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆహ్వానాన్ని మన్నించారు. వారు ఇద్దరు సెలవు తీసుకుని బయలుదేరారు.  వారికి వీడ్కోలు చెప్పడానికి సినారె ఇంటి గేటు వరకు వచ్చారు. కరణం గారు తన మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేశారు.  ఉపాధ్యాయుల వారు వెనక సీట్ మీద కూర్చున్నారు. అది చూసి సినారె "భలే... ముందు కరణం, వెనుక వ్యాకరణం"  అని చెణుకు విసిరారు.  "వ్యాకరణం" అంటే తెలుగు పండితులు అని సినారె శ్లేష..._

             **

1980 ప్రాంతాల్లో సినారె ఒక పాట రికార్డింగ్ కోసం ఒక స్థూడియోకు వెళ్లారు. అక్కడ ఆయనకు వేటూరి సుందర రామమూర్తి గారు కనిపించారు. సినారె ను చూడగానే వేటూరి ఒకింత ఆశ్చర్యంగా " అరె... ఏమిటి ఈరోజు అర్ధాంగి తో వచ్చారు ?" అని ప్రశ్నించారు.

సినారె ఉలిక్కిపడి వెనక్కు చూసారు.  అప్పుడు అర్ధం అయింది ఆయనకు... వెంటనే పకపకా నవ్వారు.  విషయం ఏమిటంటే... ఆ రోజు సినారె హాఫ్ హాండ్స్ షర్టు తో వచ్చారు.  ఆ పొట్టి చేతుల చొక్కాను "అర్ధ + అంగి =  అర్ధాంగి ... గా పోల్చారు అన్నమాట వేటూరి...

     **

వేటూరి మహాకవి, పండితుడు, జ్ఞాన సంపన్నుడు అని నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంతటి విజ్ఞాన ఖని కి కూడా ఒక వ్యసనం ఉన్నది.  గుర్రపు పందాలు కాయటం ఆయనకు పెద్ద చెడ్డ అలవాటు.  అడవిరాముడు సినిమాకు పాటలు రాసే రోజుల్లో సినిమాకోసం పాటలు రాయడానికి స్థూడియో కు వెళ్లారు వేటూరి. ఆ రోజు ఉదయమే ఒక రేసులో ఆయన డబ్బు పోగుట్టుకున్నారు.  మూడ్ బాగా లేదు.  ఎంటీయార్ జయప్రదల మధ్య యుగళగీతం. మైండ్ పనిచేయటం లేదు.  ఎంతసేపటికీ రేసులకు పోయి పారేసుకున్నాను అనే ఆలోచన తొలుస్తున్నది. ఆ ఆలోచన తోనే కసి రేగి అదే లైన్ ను పల్లవిగా రాసేశారు.  మహదేవన్ కు విపరీతంగా నచ్చేసింది.  ఫలితంగా ఈ నాటికీ కుర్ర వృద్ధ భేదం లేకుండా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఆ పాట.

ఆ "రేసు" కోబోయి  పా"రేసు" కున్నాను హరి హరి,,,!
(సేకరణ)

No comments