Breaking News

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, టీవీవీ, టీవీఎస్‌, ఓయూ రీసెర్చ్ స్కాలర్స్‌, ఎస్‌ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రగతిశీల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. సభకు ప్రొ.లక్ష్మి అధ్యక్షత వహించగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా పనిచేసిన బూర్గుల నరసింగరావు ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సంధర్భంగా విప్లవ రచయిత ఉస్మానియా పూర్వ విద్యార్థి వరవర రావు ప్రసంగం...
ʹʹదేశంలో వర్గపోరాటాన్ని బలపరుస్తూ నిలబడిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ... తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ముక్దుం మొయినుద్దీన్ మొదలుకొని అనేకమంది విప్లకారులను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది.... 1952 లోనే ఉస్మానియాను హిందీ యూనివర్సిటీగా మార్చాలన్న నెహ్రూ ప్రయత్నాలకు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్ర పోరాటం చేసి ఆ ప్రయత్నాన్ని ఆపగల్గారు... ఆ రోజునుండి సమాజ మార్పుకోసం జరిగే ప్రతి పోరాటంలో ఉస్మానియా ఉంది... ఆతర్వాత యూనివర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తికోసం మహత్తర పోరాటం జరిగింది.. శాస‌న సభ తీర్మానం చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి నర్సింహారావు అనే ప్రొఫెసర్ ను వైస్ ఛాన్సలర్ గా నియమిస్తే.. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఎనిమిది రోజుల పాటు యూనివర్సిటీ చుట్టూ మోహరించి ఆ వైస్ ఛాన్సలర్ ను యూనివర్సిటీ లోనికి అడుగు పేట్టనివ్వలేదు.. 1969 లో ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో వందలాదిమంది ఉస్మానియా విద్యార్థులు అమరులయ్యారు ...ఆ తర్వాత ఉస్మానియా నక్సల్బ‌రీ వెలుగులో నడవడం ప్రారంభించింది... 1972 లో జార్జిరెడ్డితో విప్లవ విద్యార్థి ఉద్యమం ప్రారంభ‌మయ్యింది... ఆనాటి నుండి ఈ దేశ విప్లవ పోరాటానికి ఈ యూనివర్సిటీ ఎంతో మంది నాయకులను ఇచ్చింది... జంపాల చంద్రశేఖర ప్రసాద్, బాబూ రావు లాంటి విప్లవ విద్యార్థి నాయకులు ఈ ఉస్మానియా విద్యార్థులే.... పీడీఎస్యూ, ఆరెస్యూ ఏర్పాటు తర్వాత ఉస్మానియా విద్యార్థి ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది... వర్గపోరాట రాజకీయాల్లో రాటుదేలింది.... ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా విద్యార్థులే.... భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవంకోసం ఆ విద్యార్థి వీరులు సాగించిన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉన్నది... ఇవ్వాళ్ళ అది దేశవ్యాపితమైనది. అటువంటి వారసత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కొనసాగిస్తుందని ఆశిస్తున్నా...ʹʹ
గద్దర్‌ మాట్లాడుతూ..
ʹʹసామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తుల చిప్‌లను మన మెదళ్ల నుంచి తొలగించి, ఈ దేశాన్ని రక్షించేందుకు యువతే కీలక పాత్ర పోషించాలి... తమ అత్యున్నతమైన జీవితాలను పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేసే ఎంతోమంది వీరులను ఓయూ అందించింది...ʹʹ
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..
ʹʹఓయూలో ప్రగతిశీల ఉద్యమాలపై మతోన్మాదులు దాడులు, హత్యలకు పాల్పడ్డారు... యూనివర్శిటీల్లో కనీసం భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా అమానుషంగా దాడులు జరుగుతున్నాయి.... జాతీయవాదం పేరుతో కుహనాజాతీయవాదులు ప్రగతిశీల వ్యక్తులు, శక్తులపై తప్పుడు కేసులు మోపుతున్నారు.... విశాలమైన ఫాసిస్టు వ్యతిరేక, వామపక్ష శక్తుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి....ʹʹ
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ..ʹʹప్రపంచంలోనే నాలెడ్జ్‌ సొసైటీని ఇవ్వగలిగే సత్తా ఇండియాకు ఉంది... ఫ్రాన్స్‌లో విప్లవోద్యమం రగులుతున్న తరుణంలో ఓయూలో జార్జిరెడ్డి నాయకత్వంలో మార్క్సిజం, కాపిటల్‌ వంటి అంశాలపై స్టడీ సర్కిల్స్‌ జరిగేవి, దీనికి నిజాం కళాశాల నుంచి నేను హాజరయ్యేవాణ్ని...
వామపక్షాలు ఐక్యతగా లేని కారణంగా మతోన్మాద శక్తులు పెరుగుతుయి...వామపక్షాలను బలమైన శక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ఉద్యమాలు చేపడతాము...ʹʹ
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపక సభ్యులు కె.లలిత, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ పాల్గొన్నారు.

(2017-04-06 13:12:46)

No comments